జగన్ ఢిల్లీ పర్యటన ఖరారు.. బెయిల్ రద్దు పిటిషన్‌ కోసమేనా?

ఏపీ సీఎం జగన్ గురువారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఖరారైందని సమాచారం. హోంమంత్రితో పాటు మరికొంతమంది కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఢిల్లీలోనే మకాం వేసిన వైసీపీ ఎంపీలు.. రక్షణ, ఆర్థిక శాఖ మంత్రుల అపాయింట్ మెంట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక రఘురామకృష్ణరాజు వ్యవహరం, బెయిల్ రద్దు పిటిషన్ నేపథ్యంలో సీఎం హస్తిన పర్యటనకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.

గత కొన్ని రోజులుగా రోజుకొక లేఖతో వైసీపీ వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు రఘురామ. పలువురు ఎంపీలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లకు తనపై థర్డ్ డిగ్రీ జరిగిందంటూ ఇప్పటికే లేఖలు రాసిన రఘురామకృష్ణ.. రాజద్రోహం సెక్షన్ ప్రయోగంపై ధ్వజమెత్తతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులను కలసి ఏపీ ప్రభుత్వ వైఖరిని వివరించే యోచనలో ఏపీ సీఎం, ఎంపీలు ఉన్నట్టు తెలుస్తోంది. సోమవారం ఢిల్లీ పర్యటన ఉన్నప్పటికీ చివరి నిమిషంలో వాయిదా పడింది. అయితే హస్తిన స్థాయిలో జరిగిన సంప్రదింపులతో బుధవారానికి ఖరారైంది. సీఎం జగన్ పర్యటన పూర్తి వివరాలు నేటి సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *