ఈటలకు చెక్ చెప్పేందుకే ఈ హడావుడి అంతానా?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేసే ప్రతి పనిలోనూ మర్మం దాగి ఉంటుంది. చూసే వాడికి చేసేంతగా ఆయన చేసే పనుల వెనుక విషయం ఉంటుంది. ఒక్కసారి పాత పేపర్లను తిప్పి చూడండి. ఈటల పై భూకబ్జా ఆరోపణల మరక పడిన తర్వాత నుంచి సీఎం కేసీఆర్ ఎంత యాక్టివ్ గా ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. అంతేకాదు.. ఎవరూ ఏమీ అడగకుండానే ఆయన పెండింగ్ హామీల్ని వరుస పెట్టి తీర్చేస్తున్నారు. పాలనలో వేగం పెంచటం.. సంక్షేమ కార్యక్రమాల్ని దూసుకెళ్లేలా చేయటం.. వరాల మీద వరాల్ని ప్రకటిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

లాక్ డౌన్ వేళ.. రాష్ట్ర ఆదాయం దారుణంగా దెబ్బ పడిన వేళ.. నిధుల కోసం కటకటలాడుతున్నప్పటికి.. పెంచిన ఉద్యోగుల జీతాల్ని ఈ నెల నుంచే ఇస్తామని చెప్పటం కానీ.. 4.46 లక్షల పెండింగ్ రేషన్ కార్డుల్ని పదిహేను రోజుల్లో పంపిణీ చేయాలన్న ఆదేశం కానీ.. అన్ని జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేయటం.. ఈ రోజు 19 జిల్లాల్లో ప్రారంభించటం లాంటి పనులు వరుస పెట్టి చేయటం కనిపిస్తుంది.

ఈటల పై కత్తి దూయటానికి ముందు.. తర్వాత అన్నది చూస్తే కేసీఆర్ లో వచ్చిన మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపించక మానదు. ఎందుకింత మార్పు? ఎందుకింత అప్రమత్తత? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి. ఈటలను ఒక సాదాసీదా వ్యక్తిగా జమ కడుతూ టీఆర్ఎస్ నేతలు విమర్శలతో ఉతికి ఆరేస్తున్న సంగతి తెలిసిందే. అయితే..ఈటల బలం.. శక్తి సామర్థ్యాలు అందరి కంటే ఎక్కువ కెసిఆర్ కె తెలుసు. అందుకే.. ఆచితూచి అన్నట్లుగా అడుగులు వేస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికలో ఈగోకు పోవటం.. అవసరానికి మించిన ఆత్మవిశ్వాసానికి పోవటం.. గెలుపు మీద ధీమాతో దేన్ని లెక్క చేయకపోవటంతో జరిగిన నష్టం కేసీఆర్ కు బాగా తెలుసు. దాని నుంచి బయటకు రావటానికి ఆయన పడిన తిప్పలు అన్ని ఇన్ని కావు. అందుకే.. అలాంటి అవకాశం ఇవ్వకుండా.. ఈటల రాజీనామాతో జరిగే ఉప ఎన్నికకు ముందు రాష్ట్రంలో వాతావరణం తనకు అనుకూలంగా మార్చుకోవాలన్నదే కేసీఆర్ ఎత్తుగడగా చెబుతున్నారు.

వ్యతిరేకత ఏ మొగ్గలో ఉన్నా.. దాన్ని హైలెట్ చేయటంలో బీజేపీ నేతలకు ఉన్న టాలెంట్ కేసీఆర్ కు తెలియంది కాదు. అందుకే.. ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదన్నది ఆయన ప్లానింగ్ గా చెబుతున్నారు. ఈటల ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం మీద ప్రత్యేక అభిమానాన్ని ప్రదర్శించినా దాని వల్ల జరిగే నష్టం తెలిసిందే. ఇంతకాలం ఈ ప్రేమ ఏమైందని సూటిగానే ప్రశ్నిస్తారు.

అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాల్ని చేపట్టి.. వాటి ప్రయోజనాలు తాను టార్గెట్ చేసిన ఈటల నియోజకవర్గం మీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు చెబుతున్నారు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలన్న సామెతకు తగ్గట్లే.. ఈటల లాంటి భారీ పామును కొట్టాలంటే అంతకు మించిన పెద్ద దుంగ అవసరం ఉంటుంది. అందుకే.. ఉప ఎన్నికకు ముందు రాష్ట్రంలో పాజిటివ్ వేవ్ కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారన్న మాట వినిపిస్తోంది. తాను టార్గెట్ చేసిన ఈటల పని పట్టేందుకు ముందు ప్రజల్ని ప్రసన్నం చేసుకోవాలన్నదే కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. ఎవరినైనా టార్గెట్ చేసినప్పుడే ప్రజలు గుర్తుకు వస్తారా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *